చిన్నప్పుడెప్పుడో ఒక్కసారి చూసినా కొన్ని సినిమాలు నిన్ననే చూసామేమో అన్నట్లుగా బాగా గుర్తుండిపోతాయి. అలా నాకు గుర్తుండిపోయిన ఇష్టమైన సినిమాల్లో ఒకటి “అప్పు చేసి పప్పు కూడు“. 1958 లో విజయా పిక్చర్స్ ద్వారా విడుదలై ఘన విజయాన్ని చవిచూసిన సంపూర్ణ హాస్యభరిత చిత్రం. ఆర్భాటాలకోసం “అప్పు” చేయటం, దానిని ఎగొట్టి తప్పించుకోవటం ఎన్ని అనర్ధాలకు దారి తోస్తుందో “అప్పు చేసిన పెద్దలకు” మెత్తగా తెలియచెప్పి, వారిని మంచి దారికి మళ్ళించటం సూక్ష్మ కథాంశం. దీనిని ఎంతో హృద్యంగా తెరపైకెక్కించారు ఈ సినిమా దర్శకుడైన ప్రముఖ దర్శక, నిర్మాత ఎల్.వి. ప్రసాద్ . ఎన్.టి.రామరావు, సావిత్రి, జగ్గయ్య, జమున, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, రేలంగి, గిరిజ, ఎస్.వి.రంగారావు, రమణా రెడ్డి, సూర్యాకాంతం, ముక్కామల, అల్లు రామలింగయ్య, చదలవాడ మొదలైన హేమాహేమీలు తమ నటనా పటిమతో తమ తమ పాత్రలకు ప్రాణం పోసారు.
జాతీయోద్యమంలో జైలుకి వెళ్ళి విడుదలౌతాడు రాజా. దివాన్ బహదూర్ ముకుందరావు ఏకైక మనవరాలు, ఆయన ఆస్తికి వారసురాలు అయిన మంజరి(సావిత్రి), రాజా ప్రేమికులు. జైలు నుండి విడుదలైన రాజాను కలుసుకుంటారు అతని మిత్రుడు భజగోవిందం(రేలంగి), మంజరి. రావు బహదూ రామదాసు తన ఆస్తిని హరించేసి కోడలు, తన చెల్లెలు లీల(జమున)ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడని, మంజరి ఆమెను రక్షించిందనీ తెలుసుకుంటాడు. రామదాసుకు బుధ్ధి చెప్పాలని బయల్దేరబోయిన రాజను వారిస్తాడు భజగోవిందం. రామదాసు వంటి దుర్మార్గుడినీ, ముకుందరవు వంటి బోళా మనిషినీ వాళ్లంతట వాళ్ళే మారేలా చెయ్యాలనీ; ఆ ప్రయత్నంలో లీల కాపురం బాగుపడి, మంజరితో రాజాకు వివాహం కూడా జరిగాలంటే తను చెప్పినట్లు నాటకం ఆడాలని వారిద్దరినీ ఒప్పిస్తాడు భజగోవిందం.
భజగోవిందం నాటకాలు వేస్తూంటాడు. తెలివయినవాడు. రావుబహదుర్ రామదాసు దగ్గర గుమాస్తా. రావు బహదూర్ రామదాసు(సి.ఎస్.ఆర్)కు అప్పు చేసి పప్పు కూడు తినటం వ్యసనం. తలకు మించిన అప్పులు చేసి గొప్ప శ్రీమంతుడిలా చలామణి అవుతూంటాడు. అప్పులవాళ్ల బాధ నుంచి తప్పించుకోవటానికి ఇద్దరు వస్తాదులను బాడీ గార్డులుగా కూడా పెట్టుకుంటాడు. అప్పులు పుట్టించటానికి నాటకాల భజగోవిందాన్ని గుమాస్తాగా పెట్టుకుంటాడు. తన దుర్గుణాలను అడ్డుకుంటున్నాడని తండ్రినే గదిలో తాళ పెట్టిన దుర్మార్గుడు రామదాసు. పదేళ్ళ తరువాత డాక్టరై లండన్ నుండి తిరిగివస్తున్న తన కొడుకు రఘు(జగ్గయ్య౦)ని మంజరికి ఇచ్చి వివాహం చేసి ముకుందరావు ఆస్తి అంతా కాజేయాలన్నది రామదాసు పన్నాగం. ముకుందరావు గారి మేనేజర్ రామలింగం(రమణారెడ్డి) తన కూతురు ఉష(గిరిజ)కు పెద్ద సంబంధాలు వెతుకుతూంటాడు. కానీ ఉష, భజగోవిందం ప్రేమించుకుంటారు. ఉష తల్లి (సూర్యాకాంతం) కూడా భజగోవిందం పార్టీనే. రామలింగానికి తెలియకుండా అతను తెచ్చే సంబంధాలన్నీ ఇంట్లో వాళ్ల సాయంతో చెడగొడుతూ ఉంటాడు భజగోవిందం.
భజగోవిందం ప్లాన్ ప్రకారం రామదాసును బెదిరించి లీలను అతని ఇంట్లో దిగబెడతాడు రాజా. మూగపిల్లగా అయితేనే ఇంట్లో ఉండనిస్తానన్న రామదాసు తీర్మానానికి ఒప్పుకుంటుంది లీల. ఇక భజగోవిందం రాజాను “బొంకులమర్రి రాజావారిగా” వేషం వేయించి ముకుందరావు ఇంటికి తీసుకువెళ్తాడు. మహారాజాలన్నా, సాధువులన్నా గౌరవం ఉన్న ముకుందరావు మంజరిని రాజా వారి సేవకు నియమిస్తాడు. ఈలోపూ రఘు లండన్ నుంచి వస్తాడు. తాతగారిని గదిలోంచి బయటకు తెస్తాడు. పనిపిల్లే తన భార్య అని తెలుసుకుంటాడు. ఎవరికీ తెలీకుండా భజగోవిందంతో కలిసి తానూ నాటకం ఆడతాడు. రామదాసుకు బుధ్ధి వస్తుందా? ముకుందరావు మంజరి-రాజాల వివాహానికి ఒప్పుకుంటాడా? ఉష-భజగోవిందం, భార్యాభర్తలైన రఘు-లీలలు ఎలా కలుస్తారు అన్నది మిగిలిన కథ.
దుర్మార్గమైన పాత్ర అయినప్పటికి సి.ఎస్.ఆర్ నటన ఆ పాత్రెఅను మెచ్చుకునేలా చేస్తుంది. అప్పు ఎలా పుట్టించాలో, అప్పుల వాళ్లను ఎలా వదలించుకోవాలో రామదాసు పాత్ర చెప్పే సూత్రాలు నవ్వుపుట్టిస్తాయి. సినిమాలోని దాదాపు అన్ని పాత్రధారులు భజగోవిందం వేయించిన నాటకంలో భాగధారులే కనుక అతని పాత్ర బరువు, తెలివితేటలు కూడా గుర్తుంచుకోదగ్గవి. మంజరి పాత్ర తాత దగ్గర ప్రదర్శించే గారం, రాజా దగ్గర అనురాగం, రఘుతో వ్యంగ్యం మొదలైన అన్ని ప్రధాన రసాలనూ సావిత్రి ఎలా పడించారో చూశాకా ఎవరైనా ఆమె అభిమానులవకుండా ఉండగలరా అనిపిస్తుంది. చిన్న పాత్ర అయినా భర్తకు దగ్గరగాఉండాలని మూగపిల్లగా జమున పడే ఆరాటం చూసి తీరవలసినదే. ఇక హేమాహేమీలు ఎన్.టీ.ఆర్, ఎస్,వీఆర్ ల నటన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.
చిత్రంలో ప్రధానమైనది పాత్రలు ఆడే నాటకాలు అవటం వల్ల సదాశివబ్రహ్మం గారి డైలాగులు చిత్రానికి ఆయువు అనవచ్చు. చాల చోట్ల వ్యంగ్య హాస్య ప్రధానమైన సంభాషణలు రక్తికట్టిస్తాయి. మార్కస్ బర్ ట్లీ గారి ఛాయాగ్రహణం మెచ్చదగినదే. ఈ సినిమా సీడి ఒకటీ గతంలో కాపీ చేసుకున్నాను కానీ చివరి భాగం మిస్సయిందని ఈ మధ్యనే మళ్ళీ కొనుక్కున్నాను. ఇష్టమైన సినిమానే కాక ఇటీవలే చూడటం వల్ల కూడా ఈ సినిమా గురించి రాయాలనే తలంపు కలిగింది. చిత్రంలో అన్ని పాటలూ జనాదరణ పొందినవి కావటం వల్ల ఈ సినిమాను “మ్యూజికల్ హిట్” అని కూడా అనవచ్చు. పాటలకు పింగళి నాగేంద్రరావు గారు రాసిన సాహిత్యం ప్రసంశాపాత్రమైనది. నాకైతే దాదాపు అన్ని పాటలు ఇష్టమే.
*అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా (ఘంటసాల)
*రామ రామ శరణం భద్రాద్రి రామ శరణం (పి.లీల)
*ఆనందం పరమానందం (ఘంటసాల, పి.లీల)
*కాశీకి పోయాను రామా హరీ (ఘంటసాల, స్వర్ణలత)*కాలం కాని కాలంలో కోయిల కూతలు ఎందుకనో ( పి.లీల, సుశీల)*చేయి చేయి కలుపరావె హాయి హాయిగా (ఏ.ఏం.రాజా, పి.లీల)
*ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి (పి.లీల, ఘంటసాల)


ఈ సినిమాలో “నవకళా సమితిలో” పద్యం నాకు భలే ఇష్టం. సినిమా మొత్తానికి సూత్రధారి రేలంగే కాబట్టి ఈ సినిమాకి నిజమైన కధానాయకుడు ఆయనే అని నా అభిప్రాయం. బహుశా అధికశాతం విజయావారి సినిమాలలో హీరోని సైతం డామినేట్ చేసే పాత్ర ఏదో ఒకటి ఉంటుందేమో. (పాతాళ భైరవి – ఎస్వీఆర్, మాయా బజార్ – ఎస్వీఆర్, గుండమ్మ కథ – సూర్యకాంతం, అప్పు చేసి పప్పు కూడు – రేలంగి, షావుకారు – ఎస్వీఆర్ ఇలా అన్నమాట)
ఇక ఆంగ్లో ఇండియన్ అమ్మాయిగా కస్తూరి శివరావు “మామగాడు చాలా మోసగాడు” అని చెప్పే డైలాగ్స్ కూడా ఈ సినిమాలో నాకు ఇష్టం.
ఈ సినిమా నాకూ చాలా ఇష్టము .
ఎచటినుంచ్డి వీచెనో ఈ చల్లని గాలి పాట నాకు నచ్చుతుంది .
చిన్నప్పుడు ఒకసారి ఈ సినిమా చూసి పిచ్చ “confuse” అయిపోవడం బాగా గుర్తు.
NTR జైలు నుంచి బయటకి వచ్చిన తరువాత, సినిమా మొదలు లోనే ఒకేసారి చాలా క్యారక్టర్ల పేర్లు dialogues ద్వారా పరిచయం అయిపోయేసరికి అవన్నీ గుర్తు పెట్టుకోవడం, వాటి మధ్య relations అర్ధం చేసుకోవడం కొంచెం complex అనిపించింది నాకు. చుట్టూ ఉన్న పెద్దలు మాత్రం హాయిగా నవ్వుకుంటూ చక్కగా ఆస్వాదిస్తూ సినిమా చుశారు.
పెద్దయ్యాకా CD కొనుక్కుని చుసి, సినిమాలో ప్రత్యేకత పూర్తిగా అర్ధం అయ్యాకా, నేను కూడా ఈ సినిమా ఆస్వాదించేవాళ్ల categoryలోకి వచ్చేసాను
.
అప్పు చేసి పప్పు పప్పు కూడు సినిమాను అప్పట్లో రమణ గారు ఆంధ్ర పత్రికలో చాలా ఘాటుగా విమర్శించారట..చాలా గజిబిజిగా ఉంది.. జనాలకు అర్థం కావడం కష్టం అని రాశారట.. అప్పట్లో ఇలా పెద్ద సినిమాను అంతగా విమర్శించటం ఒక సంచలనం.. కానీ తర్వాత విజయా బ్యానర్ వాళ్ళు కూడా రమణ గారు రాసిన విమర్శను తమ పబ్లిసిటీ ప్రకటనలలో వాడుకున్నారట.. “కోతి కొమ్మచ్చి” లో రమణగారు ఇదంతా వివరంగా రాశారు..
శంకర్ గారూ, మీరు చెప్పిన పాయింట్ నోట్ చేసుకోవాలండోయ్ !
ధన్యవాదాలు.
మాల గారూ,
నాకైతే దాదాపు అన్ని పాటలు భలే నచ్చుతాయండి.
సోమశేఖర్ గారూ, చిన్నప్పుడేమిటి మొదటిసారి చూసిన ఎవరికైనా అలానే అనిపిస్తుందేమో. కానీ సంభాషణల్లో అంతర్లీనమైన హాస్యం సినిమాలోని కన్ఫ్యూజన్ ను కూడా ఆస్వాదించేలా చేస్తుంది.
ధన్యవాదాలు.
కార్తీక్ గారూ, అవునండి నిజమే. రమణగారు పత్రికకు రాసిన చాలావరకూ సినిమారివ్యూలన్నీ “బాపూరమణీయం” పుస్తకంలో ఉన్నాయి. గురుదత్ “ప్యాసా”నూ, “కాగజ్ కే ఫూల్” మొదలైన సినిమాలను కూడా వారు ఘాటుగా విమర్శించారు.
ధన్యవాదాలు.